వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా దూరం..... విశ్వాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు బి.పద్మావతి


విశాఖపట్నం(ఉదయజ్యోతి): ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే  కరోనా దూరమవుతుందని విశ్వాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు బి.పద్మావతి సూచించారు. జిల్లాలో పలు గ్రామాలలో తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన  ఆమె ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ ను అందరం పాటించి, వీలయినంత వరకు ఇంటి వద్దనే వుండాలన్నారు. ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకుంటూ ఇంటిని క్రిమిరహితంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒకశాతం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచుకోవాలని సూచించారు. లేదా 10 గ్రాముల బ్లీచింగ్ పౌడరును లీటరు నీటిలో కలిపిన ద్రావణంతో ఉమ్మి వేసే ప్రదేశాలు, టాయిలెట్లు, బాత్రూంలు, సింకు, వాష్ బేసిన్లు, ఇంటి ముందు మనం మసలే  ప్రదేశాలను, వాడిన బట్టలు విడిచే చోటులో, ఉతికేప్రదేశాలలో చల్లుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులలో బైటకు వెళ్ళి కూరగాయలు తెచ్చినపుడు వాటిని పరిశుభ్రంగా మూడు నాలుగుసార్లు కడగాలన్నారు. ప్రతిరోజు ఇంటిని శానిటైజర్ లేదా ఉప్పునీటితో శుభ్రపరచుకోవాలని సూచించారు. గోరువెచ్చని నీటిని మాత్రమే త్రాగాలన్నారు. ఉపయోగించిన బట్టలను వేడినీటితో ప్రతి నిత్యం ఉతికి ఎండలో ఆరబెట్టాలన్నారు. మెటాలిక్ డోర్ హ్యాండిల్స్, డైనింగ్ టేబుల్, టివి రిమోట్, తాళాలు వంటి పరికరాలను శానిటైజర్ ఒక శుభ్రమైన గుడ్డపై వేసి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా తుడవాలన్నారు. చేతులను రోజుకి 5 లేక 6సార్లుకి పైగా సబ్బుతోగాని, డిస్ ఇన్పెక్షన్ ద్రావణంతో గాని 2 నిమిషాలకు తక్కువ కాకుండా శుభ్రం చేసుకోవాలన్నారు. నోటిని, ముక్కుని,కళ్ళని చేతులతో తాకరాదన్నారు. వీలయినంతవరకు ఇంటి వద్దనే వుంటూ పై సూచనలు పాటిస్తూ కరోనా నుండి రక్షణ పొందాలని పద్మావతి సూచించారు.